
విజయనగరం పట్టణం ముడిదాం గ్రామం వద్ద గల ‘ఇన్సిపైరో’ స్కూలులో విద్యార్థులకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ‘శౌర్య’ పేరుతో సైబరు, రహదారి, మహిళల భద్రత, మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే అనర్థాలపట్ల అవగాహన కార్యక్రమంను జూలై 22న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ముఖ్య అతిధిగా
హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మాట్లాడుతూ – యువత చిన్న వయస్సులోనే మాదక ద్రవ్యాలకు అలవాటుపడి, జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. ఎవరైనా ఒకసారి డ్రగ్స్ తీసుకోవడానికి
అలవాటు పడితే వారికి తెలయకుండానే, త్వరితగతినే వాటికి బానిసలుగా మారే ప్రమాదముందన్నారు. కావున, విద్యార్ధులు మత్తు కలిగించే మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. విద్యార్థులు, యువత చెడు మార్గాల్లో నడుస్తు
న్నారని గుర్తించి, వారిని సన్మార్గంలో నడిపించేందుకు ‘సంకల్పం’ కార్యక్రమంతో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున
అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అంతేకాకుండా, గంజాయి అక్రమ రవాణను నియంత్రించేందుకు
ప్రత్యేక కార్యచరణ రూపొందించి, పెద్ద ఎత్తున గంజాయిని సీజ్ చేయడంతోపాటు, అందుకు కారకులైన నిందితులను అరెస్టు చేసామన్నారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన యువత డ్రగ్స్ ను కొనుగోలు చేసేందుకు అవసరమైన
డబ్బులు లేక, దొంగతనాలకు పాల్పడుతూ, జీవితాలను నాశనం చేసుకుంటున్నారని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు.
సైబరు నేరాలు పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలన్నారు.
విద్యార్ధులకు సరైన అవగాహన లేకపోవడం వలన సోషల్ మీడియాలో ప్రచారమయ్యే విషయాలు నిజమని భావించి, డబ్బులను పోగొట్టుకున్నారన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు చేసే కాల్స్ కు స్పందించవద్దని, వారు పంపే లింకులపై క్లిక్
చేయవద్దని, ఇతరులతో ఒటిపి నంబర్లును షేర్ చెయ్యవద్దన్నారు. ఇటీవల కాలంలో డిజిటల్ అరెస్టు పేరుతో నేరగాళ్ళు
మోసాలకు పాల్పడుతున్నారన్నారు. మీ పేరుతో కొరియర్ వచ్చిందని, ఆ ప్యాకెట్
లో నిషేధిత డ్రగ్స్ దొరికాయని, విచారణకు హాజరుకావాలని, డిజిటల్ అరెస్టు చేసామని బెదిరింపులకు పాల్పడుతూ, డబ్బులను దోచుకుంటున్నారన్నారు. రహదారి భద్రత పట్ల కూడా విద్యార్ధులు అవగాహన కలిగి ఉండాలన్నారు. మైనరు డ్రైవింగుకు పాల్పడవద్దని, లైసెన్సు
లేకుండా వాహనాలు నడపవద్దన్నారు. చాలామంది యువత రహదారి ప్రమాదాల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారన్నారు.
కావున, వాహనాలను నడిపేటప్పుడు నాణ్యత కలిగిన హెల్మెట్స్ ను ధరించాలని, రహదారి భద్రత నియమాలు పాటించాలన్నారు. మహిళల భద్రతకు పోలీసుశాఖ చాలా చర్యలు చేపడుతుందని, ఇందుకుగాను ప్రత్యేకంగా శక్తి యాప్ ను అందుబాటులోకి తీసుకొని వచ్చిందన్నారు. ప్రతీ ఒక్కరూ తమ మొబైల్స్ తప్పనిసరిగా శక్తి యాప్ను డౌన్లోడు చేసుకోవాలన్నారు. ఎవరికైనా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినపుడు మొబైల్ ఫోనులోని శక్తి యాప్ ఎస్.ఓ.ఎస్. బటన్ క్లిక్ చేస్తే, దగ్గరలో ఉన్న పోలీసు సిబ్బంది క్షణాల్లో మీ వద్దకు చేరుకొని రక్షణ కల్పిస్తారని తెలిపారు. చాలామంది విద్యార్థులు 18సం.లు నిండకుండానే లైంగిక నేరాల్లో చిక్కుకోవడం వలన వారిపై పోక్సో కేసులు నమోదవుతున్నాయన్నారు. ఈ కేసుల్లో నిందితులుగా అరెస్టు అయితే విద్యార్థి జీవితం నాశనం కావడంతోపాటు, 10సం.లు వరకు జైలుశిక్ష లేదా జీవిత ఖైదు విధించబడుతుందని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.
అనంతరం, రోటరీ క్లబ్ ప్రత్యేకంగా రూపొందించిన శౌర్య వాల్ పోస్టరును జిల్లా ఎస్పీ ఆవిష్కరించి, రాష్ట్ర వ్యాప్తంగా శౌర్య కార్యక్రమాన్ని అన్ని కళాశాలలు, పాఠశాలల్లో నిర్వహించాలని రోటరీ క్లబ్ సంకల్పించినందుకు గాను రోటరీ క్లబ్ సభ్యులను జిల్లా ఎస్పీ అభినందించారు.
ఈ కార్యక్రమంలో రోటరీ చైర్మన్ డా.ఎం.వెంకటేశ్వర రావు, ఇన్సిపైరో స్కూలు డైరెక్టరు రవి కే. మండ, ఎస్బి సిఐ ఎ.వి.లీలారావు, రూరల్ సిఐ బి.లక్ష్మణరావు, ఇన్సిపైరో, పోలీసు స్కూలు, ఆర్కే జూనియర్ కాలేజ్ మరియు కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు పాల్గొన్నారు.