
జనం న్యూస్ 23 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం జిల్లా గంట్యాడ మండల పోలీసు స్టేషను పరిధిలోని తాటిపూడి గ్రామంలో పోలీసు సేవలను
ప్రజలకు మరింత చేరువ చేసేందుకు పోలీసు ఔట్ పోస్టును ఏర్పాటు చేసామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జూలై 22న తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ముఖ్య అతిధిగా హాజరై, ప్రత్యేక పూజలు నిర్వహించి, ఔట్ పోస్టును ప్రారంభించారు. జిల్లా ఎస్పీ గార్కి గంట్యాడ పోలీసులు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మాట్లాడుతూ – ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ
కల్పించడంతోపాటు పోలీసు సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే ఉద్ధేశ్యంతో తాటిపూడిలో అభివృద్ధి చేసిన పోలీసు ఔట్ పోస్టును
ప్రారంభించామన్నారు. ఇటీవల కాలంలో తాటిపూడి రిజర్వాయరును చూడడానికి, డ్యాంలో బోటింగు చేసేందుకు
టూరిస్టుల సంఖ్య రోజురోజుకు పెరగడంతో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా టూరిస్టులను సురక్షితంగా తిరిగి
పంపేందుకు, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. డ్యాంలో బోటింగుకు వెళ్ళే సమయంలో టూరిస్టులు తప్పనిసరిగా లైఫ్ జాకెట్స్ ను వినియోగించడం, బోట్స్ పూర్తి స్థాయి
సామర్ధ్యంతో పని చేయడం, ప్రమాదాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టడం వంటి విధులను ఔట్ పోస్టు పోలీసు సిబ్బంది నిర్వహిస్తారన్నారు. ఈ ఔట్ పోస్టులో ఒక హెడ్ కానిస్టేబులు, ఒక కానిస్టేబులు విధులు నిర్వహిస్తూ, ప్రజలకు
నిత్యం అందుబాటులో ఉంటారని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు.
మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్థాలను విద్యార్థులు, యువత, ప్రజలకు వివరిస్తూ, వాటికి దూరంగా
ఉండాలని, సైబరు మోసాలు, మహిళల భద్రత, రహదారి భద్రత పట్ల అవగాహన కల్పిస్తున్నామన్నారు. మహిళల భద్రతకు జిల్లాలో ఐదు శక్తి టీమ్సున్న ఏర్పాటు చేసామని, ఈ టీమ్స్ ప్రజలు ఎక్కువగా గుమిగూడి ఉండే ప్రాంతాలైన
ఆర్టీసి కాంప్లెక్సులు, రైల్వే స్టేషన్లు, స్కూల్స్, కాలేజ్స్, ముఖ్య జంక్షన్లను సందర్శించి, శక్తి యాప్ వట్ల, యాప్
ఏవిధంగా వినియోగించాలన్న విషయాలపైన విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్
తెలిపారు.
అనంతరం, జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మరియు ఇతర పోలీసు అధికారులు తాటిపూడి డ్యాంను సందర్శించి, డ్యాంలో బోటులో ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి. సౌమ్యలత, విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు, ఎస్బి సిఐ ఏవీ లీలారావు, విజయనగరం రూరల్ సిఐ బి. లక్ష్మణరావు, గంట్యాడ ఎస్ఐ సాయికృష్ణ, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.