
విజయనగరం జిల్లాలో రాష్ట్ర హెూం మంత్రి వ్యక్తిగత సహాయకుడిగా చలామణి అవుతున్న నకిలీ వ్యక్తి అల్లూరి
అరవింద్ (21సం.లు) ను విజయనగరం 1వ పట్టణ పోలీసులు జూలై 22న అరెస్ట్ చేసారని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్,
ఐపిఎస్ తెలిపారు.
వివరాల్లోకి వెళితే.. జూలై 21న ఒక వ్యక్తి జిల్లా పోలీసు కార్యాలయంనకు వచ్చి, రిసెప్షనిస్టుగా విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబులు అరుణను కలిసి, తాను రాష్ట్ర హెూంమంత్రివర్యులు శ్రీమతి వంగలపూడి అనిత
గారి వ్యక్తిగత సహాయకుడిగా పరిచయం చేసుకున్నారన్నారు. అనంతరం, తాను జిల్లా ఎస్పీ గార్ని అత్యవసరంగా
కలవాలని కోరారు. అందుకు, మహిళా కానిస్టేబులు అరుణ ప్రస్తుతం జిల్లా ఎస్పీ గారు పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రసల్ ఫిర్యాదులు చూస్తున్నారని, కొద్ది సమయం పడుతుందని తెలిపారు. గతంలో తాను ఇచ్చిన ఫిర్యాదుపై ఎటువంటి చర్యలు చేపట్టలేదని, తాను వెంటనే జిల్లా ఎస్పీ గార్ని కలవాలని, లేకుంటే నీ అంతు తేలుస్తానని, ఉద్యోగం ఎలా చేస్తావో చూస్తానని, దౌర్జన్యం చేస్తూ, బెదిరింపులకు పాల్పడ్డారన్నారు. ఈ విషయమై మహిళా కానిస్టేబులు అరుణ 1వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చెయ్యగా, పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారన్నారు. విచారణలో నిందితుడు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన అల్లూరి అరవింద్ (21సం.లు) గుర్తించామన్నారు. నిందితుడు అల్లూరి అరవింద్ (21సం.లు) ను అరెస్టు చేసామని జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రజలు ఇటువంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి చర్యలు ఎవరు పాల్పడిన కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ హెచ్చరించారు.