
పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక సారధి వెల్ఫేర్ బ్లైండ్ హాస్టల్ లో అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె.దయానంద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జి.ఓ. నంబర్ 4 పారా క్రీడలు ఆడే దివ్యాంగులకు వరం లాంటిదని అన్నారు. ఈ జి. ఓ. ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో 3 శాతం ఉద్యోగాలను ఎటువంటి రాత పరీక్ష గాని, ఇంటర్వ్యూ గాని లేకుండానే నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత అందులో అడిగే విద్యార్హతను బట్టి నేరుగా ఉద్యోగాలు కల్పిస్తుందని అన్నారు. దివ్యాంగులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్పోర్ట్స్ పాలసీ ద్వారా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించిన పారా క్రీడాకారులకు లక్షలాది రూపాయలు ప్రోత్సాహం అందిస్తుందని, పారా ఒలింపిక్ గేమ్స్, పారా ఆసియన్ గేమ్స్ లో మెడల్స్ సాధించిన విజేతలకు కోట్లాది రూపాయిలు ప్రోత్సాహం అందజేస్తుందని వివరించారు. ఈ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు దివ్యాంగులంతా పారా స్పోర్ట్స్ ఆడేందుకు ముందుకు వచ్చి బంగారు భవిష్యత్ సొంతం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సారధి వెల్ఫేర్ బ్లైండ్ హాస్టల్ వ్యవస్థాపకులు ప్రదీప్, ద్వారకామయి అంధుల పాఠశాల వ్యవస్థాపకులు ఆశాజ్యోతి, తదితరులు పాల్గొన్నారు.