
మార్క్సిజం, లెనినిజం అజేయం అని నమ్మి కమ్యూనిజాన్ని ఊపిరిగా భారత కమ్యూనిస్టు పార్టీ ( సిపిఐ ), ప్రజా, కార్మిక సంఘాల నిర్మాణ పటిష్టత కోసం చివరి శ్వాస వరకు ఎర్రబాటలో పయనించిన కామ్రేడ్ బుగత సూరిబాబు శరీరానికే మరణం కానీ ఆశయాలకు మరణం లేదని కార్మిక ముఠా జట్లు మేస్త్రీలు అన్నారు.
ఎర్రజెండా ముద్దుబిడ్డ ఎర్రసుర్యుడు అమరాజీవి కామ్రేడ్ బుగత సూరిబాబు 5 వ వర్ధంతి కార్యక్రమాలు శుక్రవారం ఉదయం సిపిఐ జిల్లా కార్యాలయం డి.ఎన్.ఆర్ అమర్ భవన్, విజయనగరం పి. డబ్ల్యూ మార్కెట్, డి.సి.ఎం.ఎస్ లలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా అమరజీవి కామ్రేడ్ బుగత సూరిబాబు చిత్రపటానికి నాయకులు, కార్మికులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ 48 సంవత్సరములు పాటు కార్మికుల కష్టనష్టాల్లో అండగా నిలబడి ఎన్నో సమరశీల పోరాటాలు చేసి హక్కులు సాధించారు, అన్ని వర్గాల కార్మికుల శ్రమకి తగిన వేతనాల పెంపుదల కోసం కూలీ రేట్లు కోసం యాజమాన్యాలని ధీరోదాత్తంగా ఎదురొడ్డి పోరాడి సాధించిన కార్మికోద్యమ పోరాటయోధుడు అమరజీవి కామ్రేడ్ బుగత సూరిబాబు అని కొనియాడారు. కార్మిక హక్కుల కోసం చేసిన పోరాటాల్లో ఎన్నోసార్లు జైలుకి వెళ్ళిన విప్లవకారుడు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శిగా పి.డబ్ల్యు మార్కెట్ లో లోడింగ్ అన్లోడింగ్ చేస్తున్న కార్మికుల సమస్యల పై, ఒంటెద్దు బళ్ళు కార్మికుల సమస్యల పై, కాల్ గ్యాస్ డెలివరీ బాయ్ ల కార్మికుల సమస్యల పై పట్టణంలో ఒకే రోజు ఒకే సమయంలో 6 చోట్ల యడ్ల బళ్ళతో రాస్తారోకో చేసిన పోరాటంలో పోలీసుల చేతుల్లో లాఠీ దెబ్బలు తిని జైలు జీవితాన్ని అనుభవించారు. యాజమాన్యం, పోలీసులు ఏకమై అప్పట్లో ఎన్ని కేసులు పెట్టిన భయపడని ఎర్ర సూర్యుడు అని కొనియాడారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యునిగా, విజయనగరం నియోజకవర్గ కార్యదర్శిగా విజయనగరం పట్టణంలో బుచ్చెన్న కోనేరు (మార్క్స్ నగర్), శాంతినగర్, పూల్ భాగ్ కోలని, డబుల్ కోలని, సి.ఆర్ నగర్ కోలనీ, పాల్ నగర్ లలో వందల ఎకరాల ప్రభుత్వ ఖాళీ స్థలాలను సిపిఐ నేతృత్వంలో ఆక్రమించి వందల మంది పేదలకు ఇళ్ళ స్థలాలను పోరాటాలు చేసి ఇప్పించిన పేదల నాయకుడు బుగత సూరిబాబు అని తెలిపారు. విజయనగరం జిల్లా పార్టీ కార్యాలయం అమర్ భవన్ నిర్మాణం కోసం రాత్రింబవళ్ళు శ్రమించారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు గా గ్రామాల్లో తిరిగి విప్లవ గీతాలు పాడుతూ ప్రజలని చైతన్య పరిచేవారని తెలిపారు. అఖిల భారత యువజన సమాఖ్య ( ఎఐవైఎఫ్ ) జిల్లా ప్రధాన కార్యదర్శి గా, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గా బాధ్యతల్లో ఎందరో యువకుల్ని చైతన్య చేసి యువజన సమస్యలపై పోరాటాలు చేశారు అని అన్నారు. విజయనగరం పట్టణంలో విశాలాంధ్ర దినపత్రికను సైకిల్ మీద ఇంటింటికి వేసేవారని తెలిపారు. జీవితంలో ఎన్ని ఆటుపోటులు, ఒడిదుడికులు ఎదురైన కుంగిపోకుండా తాను నిమ్మిన ఎర్ర జెండ, మార్క్సిజం, లెనినిజం, సిద్దాంతం, ప్రజలు, కార్మికుల కోసం మెడలో ఎర్ర కండువాతో ఎర్ర బాటలో తన ప్రయాణం తుది శ్వాస విడిచే వరకు కొనసాగించారు. ఆయన ఆనారోగ్యంతో బాధపడుతున్నా లెక్కచేయకుండా చివరి వరకు కార్మిక సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించారు. ఆయన 48 సంవత్సరాలు కార్మక నాయకుడిగా నిస్వార్థంగా పని చేస్తూ సొంత ఇల్లు కానీ, ఎలాంటి ఆస్తిపాస్తులు కానీ సంపాదించుకోకపోయిన అంతకుమించిన ఆస్తి కార్మికుల గుండెల్లో ఓ సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. అంతేకాదు ఆయన పెద్దకుమారుడు బుగత అశోక్ నీ పార్టీకి అందించి త్యాగం చేశారని తెలిపారు. కామ్రేడ్ సూరిబాబు కుటుంబం కమ్యునిస్టు పార్టీకి అంకితం అయ్యారని వారి కుటుంబం గొప్ప త్యాగాల కుటుంబం అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో బాయి రమణమ్మ, పొందూరు అప్పలరాజు, అప్పరుబోతు జగన్నాధం, బూర వాసు, కెల్ల సూర్యనారాయణ, చందక శ్రీను, పతివాడ శ్రీను, మజ్జి చిన్నా, గనివాడ సురేష్, మురళి, అప్పన్న మరియు కార్మికులు హాజరయ్యారు.