
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఖ్యాతిగాంచిన భారతదేశం కొద్ది సంవత్సరాలుగా మత విద్వేషాలు,కులాల కుంపట్లు, భాష,ప్రాంతీయ విభేదాలతో రగిలిపోతుంది.ఇదేమిటని ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారు.విభిన్న సంస్కృతులు,సంప్రదాయాలకు నిలయమైన భారతావనిని విద్వేష భారతంగా,మతతత్వ దేశంగా మార్చేందుకు పెద్ద కుట్రలే జరుగుతున్నాయి.ఈ దేశాన్ని మతతత్వ దేశంగా మార్చే కుట్రలో భాగంగానే ఓట్ చోరీ వ్యవహారం.గతంలో ఒకరు ఓటును మరొకరు వేస్తే దొంగ ఓటు వేశారు అనేవారు.దొంగ ఓటర్లను కట్టడి చేయాల్సిన కేంద్ర ఎలక్షన్ కమిషనే (ఈసీ) ఓట్ చోరిలో ప్రధాన సూత్రధారని స్వయంగా ప్రధాన ప్రతిపక్ష నేతే ఆరోపించారు.ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలేడన్నది ఒక అప్పటి మాట.ఈ ఆధునిక ప్రపంచంలో చోరీ చేయడం ఎంత సులభమో,చోరీ ఏ విధంగా జరిగిందో తెలుసుకోవడం కూడా అంతే సులభం.ఓట్ చోరీ జరిగిందని స్వయానా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఖచ్చితమైన ఆధారంతో పవర్ ప్రజెంటేషన్ ద్వారా వివరించి, ప్రజల ముందు ఉంచడం గమనార్హం.ఈసీ మాత్రం రాహుల్ గాంధీ ఎఫిడివిట్ ఇవ్వాలని లేకపోతే ఈసీకి క్షమాపణ చెప్పాలని ప్రధాన ఎలక్షన్ కమిషనర్ చెప్పడం హాస్యంగా ఉంది.ఓటు చోరీ వెనుక ప్రధాన సూత్రధారులు,పాత్రధారులు ఎవరన్నది జగమెరిగిన సత్యం.అయినప్పటికీ ఈసీ అడ్డంగా బుకాయించే ప్రయత్నం చేస్తుంది.మహారాష్ట్రలో 2019-2024 మధ్య ఐదేళ్లలో నమోదయిన కొత్త ఓట్లు కంటే ఎన్నికలకు ముందు 6 నెలలు వ్యవధిలో అత్యధికంగా లక్షలలో కొత్త ఓట్లు నమోదు కాబడ్డాయంటే దీన్ని చోరీ అనరా? తప్పుడు చిరునామాలు,తప్పుడు పేర్లతో గంప గుత్తుగా ఓట్లు నమోదు,బతికున్న చనిపోయినట్లు ఓట్లు తొలగింపు ఇవన్నీ ఓట్లు చోరీ కాదంటారా? ఇంత అడ్డంగా దొరికిపోయిన కేంద్ర ఎన్నికల కమిషన్ మాత్రం స్వామి భక్తిని ప్రదర్శిస్తూనే ఉంది.పారదర్శకంగా పనిచేయాల్సిన ఎన్నికల కమిషన్ ఓట్ల చోరీకి సహకరిస్తే ఈ దేశం ఎటు ప్రయాణిస్తుందో అర్థం కాని పరిస్థితి.ఈ అంశంపై రోడ్డెక్కి పాదయాత్రలు చేసే పరిస్థితి వచ్చిందంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నట్టా? లేనట్టా? అన్నింటికీ మూల కారణం ఈ దేశాన్ని మతతత్వ దేశంగా మార్పు చేసి,ఈ దేశాన్ని మువ్వన్నెల జండా బదులుగా కాషాయ జెండా దేశంగా మార్చాలని కొన్ని సంస్థలు కుట్రలు చేస్తున్న పరిస్థితి.ప్రజలారా ఇప్పటికైనా మేల్కోండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోండి.. త్రివర్ణ పతకం తలదించుకోకుండా రెపరెపలాడించండి.
షిణగం శివాజీ,
సీనియర్ జర్నలిస్ట్,
జిల్లా ట్రెజరీ,
జనవిజ్ఞాన వేదిక.
ఏపీ రాష్ట్ర కార్యదర్శి,
అఖిలభారత అవయవదాతల సంఘం.