
జిల్లాలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్ధాల నివారణకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి కోరారు. జిల్లాలో పూర్తిస్థాయి నియంత్రణకు కట్టుధిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా స్థాయి నార్కోటిక్స్ కంట్రోల్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం కలెక్టరేట్‌లో శుక్రవారం జరిగింది.
ముందుగా జిల్లా ఎస్‌పి ఎ.ఆర్. దామోదర్ మాట్లాడుతూ, జిల్లాలో మత్తు పదార్ధాలు, మాదక ద్రవ్యాలను అరికట్టడానికి తీసుకున్న చర్యలను వివరించారు. జిల్లా మీదుగా గంజాయి రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలను తీసుకున్నామని చెప్పారు. ఇప్పటికే వివిధ చోట్ల చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి, వాహనాల తనిఖీని ముమ్మరం చేస్తున్నామని చెప్పారు. మత్తుపదార్ధాలను గుర్తించేందుకు రెండు డాగ్ స్క్వాడ్‌లను కూడా వినియోగిస్తున్నామని తెలిపారు. పాత నేరస్తులపైనా దృష్టి సారించామని చెప్పారు. మత్తుపదార్ధాల వినియోగాన్ని మాన్పించేందుకు జిల్లాలో డీ అడిక్షన్ సెంటర్‌ను వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల సహకారంతోనే పూర్తి స్థాయిలో డ్రగ్స్‌ను అరికట్టవచ్చునని ఎస్‌పి సూచించారు.
జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ, నేరాలను అరికట్టడంలో మన జిల్లా మెరుగైన స్థానంలో ఉందన్నారు. ముఖ్యంగా మహిళలపై దాడులు, దౌర్జన్యాలను అరికట్టడంలో 6వ స్థానంలో నిలిచామని చెప్పారు. జిల్లాలో మత్తుపదార్ధాలను, గంజాయిని పూర్తి స్థాయిలో నివారించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వివిధ వర్గాల్లో విస్తృతంగా అవగాహన కల్పించడం ద్వారా జిల్లాలో డ్రగ్స్ వినియోగం, రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టడం సాధ్యపడుతుందని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోరారు.
ఈ సమావేశంలో ఏఎస్‌పి సౌమ్యలత, డిఆర్ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, జెడ్‌పి సిఈఓ బివి సత్యనారాయణ, ఎక్సైజ్ సూపరింటిండెంట్ శ్రీనాధుడు, డిఎంఅండ్ హెచ్ఓ డాక్టర్ జీవనరాణి, డిఎస్‌డబ్ల్యూఓ వెంకటేశ్వర్రావు, డిబిసిడబ్ల్యూఓ జ్యోతిశ్రీ, వయోజనవిద్య డిడి సోమేశ్వర్రావు, డిఆర్‌డిఏ పిడి శ్రీనివాసరావు, ఆర్‌డిఓలు, డిఎస్‌పిలు, వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.
