
విజయనగరం, ఆగస్టు 17..
సమాజ అభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అన్నారు. నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏపీయూడబ్ల్యూజే 68వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ముఖ్యఅతిథిగా, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్, ఏటీకే స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఖలీల్ బాబా విశిష్ట అతిథి లుగా హాజరయ్యారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు మహాపాత్రో అధ్యక్షతన జరిగిన
ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ అంబేద్కర్ తొలుత స్వర్గీయ గురజాడ అప్పారావు, సర్ సి వై చింతామణి, మానుకొండ చలపతిరావు చిత్రపటాల వద్ద జ్యోతి వెలిగించి వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ ఎన్నో ఆటుపోట్లకు ఎదుర్కొని ప్రజా సంక్షేమం కోసం, సమాజ అభివృద్ధి కోసం జర్నలిస్టులు శ్రమించడం గొప్ప విషయమని అన్నారు. జర్నలిజం వృత్తి సవాళ్లతో కూడుకున్నదని అన్నారు. సమాజంలోని మంచి చెడులను బయటకు తీయగలిగే శక్తి ఒక్క జర్నలిజంకే ఉందని ఆయన పేర్కొన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తాను సిద్ధంగా ఉన్నానని భరోసా ఇచ్చారు. నగరంలోని జర్నలిస్టుల ఆరోగ్య భీమా ప్రీమియం చెల్లించేందుకు సైతం ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ జిల్లాలో పోలీస్ విభాగానికి జర్నలిస్టుల సహకారం గొప్పదని అన్నారు.జర్నలిస్టులకు త్వరలో క్యూఆర్ కోడ్ తో కూడిన వెహికల్ పాస్ లు మంజూరు చేస్తామని ప్రకటించారు. ఏటికే స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఖలీల్ బాబా మాట్లాడుతూ ప్రాణాలకు తెగించి సైతం జర్నలిస్టు లు తమ విధులను నిర్వర్తించడం అభినందనీయమన్నారు.
పెద్దగా ఆదాయం లేనప్పటికీ జర్నలిజం వృత్తిని నమ్ముకున్న జర్నలిస్టుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని రకాల ఆదుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా 30 ఏళ్ల సర్వీస్ నిండిన సుమారు 90 మంది సీనియర్ జర్నలిస్టులను, చిన్న పత్రికలు ఎడిటర్లను జిల్లా కలెక్టర్, ఎస్పీ, నా చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మహాపాత్రో తోపాటు రాష్ట్ర కార్యదర్శి పి ఎస్ వి ప్రసాద్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఎం ఎస్ ఎన్ రాజు, చిన్న పత్రికల సంఘం జిల్లా అధ్యక్షుడు కేజే శర్మ, యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు పంచాది అప్పారావు, ఆరిపాక రాము, చిన్న పత్రికల సంఘం జిల్లా కార్యదర్శి సముద్రాల నాగరాజు, సీనియర్ జర్నలిస్టు కందుల వాసు తదితరులు పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి జర్నలిస్టులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
ఫోటోలు..
1.సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ అంబేద్కర్
2. సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్
3. జ్యోతి వెలిగించి వేడుకలు ప్రారంభిస్తున్న జిల్లా కలెక్టర్
4. సీనియర్ జర్నలిస్టులను సత్కరిస్తున్న కలెక్టర్, ఎస్పీ