
మెంటాడ, : కూటమి ప్రభుత్వం అధికారంలోనికి రాక మునుపు గత ప్రభుత్వంలో రోడ్ల పరిస్థితిని ఉతికి ఆరేసి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం గ్రామాలలో అభివృద్ధి పేరట స్మశాన వాటిక లకు, పొలంలోని కల్లాలకు, ఎక్కడో ఊరి చివర గుడి లకు సీసీ రోడ్లు వేయించి గ్రామాల అభివృద్ధిలో రోడ్లు కీలకమని ప్రచారంలో ఊదరగొట్టిన కూటమి ప్రభుత్వం బీటీ రోడ్లను మర్చిపోయినట్లుంది. మండలంలో ఎక్కడ చూసినా తారు రోడ్ల పరిస్థితి మరి అద్వానంగా తయారయింది. ద్విచక్ర వాహనాలపై వెళ్లే వాహనదారులకు నరకం కనిపిస్తుంది అనడంలో సందేహం లేదు. పోరాం నుండి జక్కువ వెళ్లే రోడ్డు, మెంటాడ నుంచి జి టి పేట వెళ్లే ఆర్ అండ్ బి రహదారి కూడా మరి దారుణంగా తయారయింది. ఆ దారిలో అరగంటకు ఒకసారి ఆర్టీసీ బస్సులు, వందల కొలది ద్విచక్ర వాహనాలు, ఇతరతర వాహనాలు ఎన్నో వెళ్తూ ఉంటాయి. ద్విచక్ర వాహనాలపై వెళ్ళిన వారికి ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. అక్కడే కాదు మండలంలో చాలా ప్రదేశాలలో రోడ్ల పరిస్థితి ఇంతే . రోడ్డు మొత్తం అధ్వానంగా తయారైనప్పటికీ వాహనాలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందికరంగా ఉన్న అది ప్రజా ప్రతినిధులకు కానీ అధికారులకు గానీ కనిపించడం లేదు. కనీసం వారి నుండి స్పందన కూడా లేదు. ఒకవేళ వర్షం వచ్చినట్లయితే ఆ గుంతలలో నీరు చేరుకుని మరి ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు. కాగా ఈ రోడ్డు గుండా ముఖ్యంగా ఈ గుంతల మీదుగానే అధికారులు ప్రజాప్రతినిధులు తరచూ ప్రయాణాలు చేస్తూ ఈ రోడ్ల దుస్థితి చూస్తున్న గుంతలు పూడ్చడానికి ఏమాత్రం చర్యలు తీసుకోకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఈ గుంతలను పూడ్చివేసి వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో మండలంలోని అన్ని రోడ్ల దుస్థితిపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.


