A2Z सभी खबर सभी जिले की

ఆండ్ర రిజర్వాయర్ నుంచి నీరు విడుదలచేసిన మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి

రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నదని రాష్ట్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ, ఎన్ఆర్ఐ సాధికారత మరియు సంబంధాలు శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం ఉదయం మెంటాడ మండలం, ఆండ్ర గ్రామంలో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమం మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్య రాణితో కలిసి ఆండ్ర రిజర్వాయర్ నుంచి నీరు విడుదల చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమలు శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యవసాయం అభివృద్ధికి, సాగునీటికి అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఆండ్ర గ్రామంలో నిర్మించిన జలాశయం సాగునీటితోపాటు, విజయనగరం మంచినీటి ప్రాజెక్టులకు త్రాగునీటిని అందిస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్ట్ రిపేర్లు, అభివృద్ధి పనులకు రెండున్నర కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఆండ్ర జలాశయం పర్యాటకంగా అభివృద్ధి చేయుటకు ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ పథకాలను _ప్రభుత్వం_ అమలు చేస్తుందని, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మొదటిసారిగా పెన్షన్లు ప్రవేశపెట్టి అమలు చేశారని, ప్రస్తుత ప్రభుత్వం నాలుగు వేల రూపాయలకు పెన్షన్లు పెంచి అందిస్తుందని తెలిపారు. అనేక వర్గాల వారికి ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలియజేశారు.
రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమం మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ ఉత్తరాంధ్ర రైతుల భద్రత కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రతి ఎకరానికీ నీరు చేరేలా అధికార యంత్రాంగం సమర్థంగా పని చేయాలన్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. తల్లికి వందనం అందించామని, మెగాడిఎస్సి, ఒకటవ తేదీన పెన్షన్లు మంజూరు అమలు చేస్తున్నామని, ఆగస్టు 15 తేది నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయడం జరుగుతుందని, త్వరలోనే అన్నదాత సుఖీభవ అందిస్తామని మంత్రి తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని తెలిపారు.
ఈ సందర్భంగా గోవా గవర్నర్ గా నియమితులై ప్రమాణస్వీకారం చేసిన పూసపాటి అశోక్ గజపతిరాజు గారికి మంత్రులు సభాముఖంగా అభినందనలు తెలిపారు. క్రమశిక్షణ కలిగి, ప్రజా సేవకే అంకితమై, రాజకీయాల్లో ఆదర్శ ప్రాయుడైన వ్యక్తి అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మెంటాడ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చలుమూరి వెంకట్రావు అరుకు పార్లమెంట్ ఉపాధ్యక్షులు గెద్ద అన్నవరం ఆండ్ర నీటి పారుదల శాఖ చైర్మన్ కోడి సతీష్ పిఎసిఎస్ అధ్యక్షులు గొర్లె ముసలి నాయుడు మాజీ నీటి పారుదల శాఖ చైర్మన్ రెడ్డి ఆదినారాయణ మాజీ గజపతినగరం జెడ్పిటిసి సభ్యులు మక్కువ శ్రీధర్ మాజీ గజపతినగరం ఎంపీపీ గంట్యాడ శ్రీదేవి శీరంరెడ్డి కుమార్ బాబు రెడ్డి రాజగోపాల్ పోలీస్ సిబ్బంది నీటి పారుదల శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Back to top button
error: Content is protected !!