
ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవం పురస్కరించుకొని విజయనగరం రీడ్స్ మరియు విద్యలనగరి చిల్డ్రన్స్ బుక్ క్లబ్ వ్యవస్థాపకులు రేపల్లె ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఆదివారం నాడు గురజాడ అప్పారావు గారి స్వగృహం నుండి సాహితీ వేత్తలు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులతో వాక్ ఫర్ ది బుక్ ( ” పుస్తకంతో నడక -పుస్తకం కోసం నడక ” ) పేరుతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన రోటరీ పాస్ట్ గవర్నర్ డాక్టర్. ఎం. వెంకటేశ్వరరావు గురజాడ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీ ని ప్రారంభించారు. అనంతరం పుస్తకాలను చేత బట్టి మౌనంగా గురజాడ విగ్రహం వరకు నడిచి వెళ్లారు. ఈ సందర్బంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచంలో పుస్తకాలు చదివే వారి సంఖ్య 26 శాతానికి పడిపోయిందని ఇది విచారించదగ్గ విషయమని, పుస్తకాలు చదివేందుకు అన్ని వయసుల వారు ఆశక్తి చూపించాలని అన్నారు. రేపల్లె ఈశ్వరరావు మాట్లాడుతూ పుస్తక పఠనం ఆవశ్యకత తెలియజేసేందుకే ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, మంచి పుస్తకం మిత్రుడు, బోధకుడు, గురువు, వైద్యుడుగా ఉపయోగపడే సాధనమని అన్నారు. ప్రతీ ఒక్కరూ పుస్తకాలను చదవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెదమజ్జి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్. శ్రీహరి బాబు, ఛాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షులు కాపుగంటి శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సేవా సంఘం ఉపాధ్యక్షులు కె. దయానంద్, జిల్లా బార్ అసోసియేషన్ ప్రతినిధి నాలుగెస్సులరాజు, గురజాడ ఇందిరా, విశాలాంధ్ర బుక్ హౌస్ ప్రతినిధి బుగత అశోక్, ఇబ్రహీం, పెదమజ్జి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.