
నగరంలో అనధికారికంగా నిర్వహిస్తున్న బాదం మిల్క్ కేంద్రాలపై నగరపాలక సంస్థ ప్రజారోగ్య అధికారులు సిబ్బంది ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. గుడ్స్ షెడ్ ప్రాంతంలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్న బాదం మిల్క్ కేంద్రాన్ని తనిఖీ చేసి అపరాధ రుసుము విధించారు. నగరంలో ఇంకా ఇటువంటి అనధికార కేంద్రాలు ఎన్ని ఉన్నాయి? వాటి పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. కమిషనర్ పల్లి నల్లనయ్య ఆదేశాలతో ప్రజారోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి బృందం ఈ మేరకు దాడులకు ఉపక్రమించింది. బాదం మిల్క్ తయారీ కేంద్రంలో ఎటువంటి పరిశుభ్రత పాటించకుండా, కాలం మీరిన పాలతో బాదం మిల్క్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. కాలం మీరిన పాలను బయట పారబోశారు. తాజా పదార్థాలతోనే పానీయాలు తయారు చేసుకోవాలని చెప్పారు. నిబంధనలు పాటించకుండా బాదం మిల్క్,ఐస్ క్రీమ్ లను పెద్ద ఎత్తున తయారుచేసి నగరవ్యప్తంగా సుమారు 50 వరకు ఉన్న బాధం మిల్క్, ఐస్ క్రీమ్ బడ్డీలకు సరఫరా జరుగుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. అలాగే ట్రేడ్ లైసెన్సులు కూడా పొందలేదని గమనించారు. ప్రజల ఆరోగ్యానికి తీవ్ర విఘాతం కలిగించే బాదం మిల్క్ కేంద్రాల యజమానులు ఇక నుండి ప్రభుత్వ నిబంధనలు తప్పక పాటించాల్సిందేనని కమిషనర్ పల్లి నల్లనయ్య స్పష్టం చేశారు. లేని ఎడల అట్టి కేంద్రాల యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.