
ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, రోడ్డు ప్రమాదాల్లో
ప్రాణాపాయం నుండి రక్షణ పొంది, సురక్షితంగా గమ్య స్థానాలు చేరుకోవాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జూలై 6న పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – ద్విచక్ర వాహనాలపై సురక్షితంగా ప్రయాణం సాగించేందుకు ప్రతీ వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. ప్రతి సంవత్సరం చాలామంది వాహనదారులు రహదారి ప్రమాదాలలో కేవలం హెల్మెట్ ధరించని కారణంగానే మరణిస్తున్నారన్నారు. వాహనదారులు హెల్మెట్ ధరించక పోవడం వలన రహదారి ప్రమాదాల్లో తలకు తీవ్ర గాయాలపాలై, గోల్డెన్ అవర్స్ లో చికిత్స అందక ప్రాణాలు
కోల్పోతున్నారన్నారు. వాహనాలు నడిపినపుడు ప్రతీ వాహనదారుడు విధిగా నాణ్యత కలిగిన హెల్మెట్ ధరిస్తే,
ప్రమాదానికి గురైనప్పటికీ స్వల్ప గాయాలతో ప్రాణాలను రక్షించుకొనే అవకాశం ఉంటుందన్నారు. రహదారి ప్రమాదాల్లో 50శాతం వాహనదారులు హెల్మెట్ ధరించని కారణంగానే మరణిస్తున్నారన్నారు. ప్రజలు తప్పనిసరిగా
రహదారి భద్రత పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతీఒక్క ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించే విధంగా చేయాలనే సంకల్పంతో జిల్లా పోలీసుశాఖ పని చేస్తుందన్నారు. ప్రజలందరికి హెల్మ్ ధారణ పట్ల ప్రజలకు అవగాహన కల్పించి, వారిలో చైతన్యం తీసుకొచ్చేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. ద్విచక్ర వాహనదారులు ప్రయాణం చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ ధరించని వాహనదారులపై
ఎం.వి.నిబంధనలు అతిక్రమించినట్లుగా పరిగణించి ఈ-చలానాలను విధించాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. ద్విచక్ర వాహనంపై ఇంటి నుండి బయటకు వస్తే తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నిర్లక్ష్యం కారణంగా వారి కుటుంబాలు వీధిన పడకూడదన్నారు. అతివేగం ప్రమాదకరమని, వేగంకన్నా సురక్షిత ప్రయాణం ముఖ్యమని జిల్లా ఎస్పీ అన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రాణాపాయం నుండి రక్షణ పొంది, ప్రమాదాల నివారణలో పోలీసుశాఖకు సహకరించాల్సిందిగా ప్రజలను జిల్లా ఎస్పీ వకల్ జిందల్ కోరారు.