రాష్ట్రంలోనూ, ఈ జిల్లాలోనూ నెలకొన్న రైతు సమస్యలపై రెవెన్యూ డివిజన్ల స్థాయిలో సెప్టెంబర్ 9న రైతు నిరసన కార్యక్రమాన్ని పెద్ద స్థాయిలో నిర్వహించ తలపెట్టనున్నట్టు వైసీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాస్ రావు( చిన్న శ్రీను) పేర్కొన్నారు. ఈ మేరకు రైతులకు, రైతు సంఘాల నేతలకు, వైసీపీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. బుధవారం తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతాంగం అనేక సాగు సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని, ఐనా ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి కనీసం చీమకుట్టినట్టు కూడా లేదని ఎద్దేవా చేశారు. పైగా రైతుల ఆత్మ గౌరవాన్ని కించపరిచేలా ఈ ప్రాంతానికి చెందిన వ్యవసాయ శాఖా మంత్రి అచ్చెం నాయుడు బాధ్యతా రాహిత్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ చిన్న శ్రీను తప్పుబట్టారు. నాట్లు వేసిన రైతాంగానికి కనీసం యూరియాను కూడా సరఫరా చేయలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని విమర్శించారు. జిల్లాలో యూరియా, డీఏపీ వంటి ఎరువులు కొరత అధికంగా ఉందని అన్ని పత్రికల్లోనూ కథనాలు వస్తుంటే, వాటిని ఖండిస్తూ సమాచార శాఖ ద్వారా ఈ ప్రభుత్వం తప్పుడు ప్రకటనలు ఇస్తూ రైతులను దగా చేస్తుందని ధ్వజమెత్తారు. ఎరువుల కొరత, అన్నదాత సుఖీభవ లోపాలు, గిట్టుబాటు ధరలు లేకపోవడం, నిర్వీర్యం అవుతున్న రైతు భరోసా కేంద్రాలు వంటి అనేక రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళేందుకు సెప్టెంబర్ 9 న వైసీపీ ఆధ్వర్యంలో రైతు నిరసన కార్యక్రమాన్ని తలపెట్టనున్నట్టు తెలిపారు. రైతులను, రైతు సమస్యలపై పోరాడే అన్ని వర్గాలను కలుపుకుని జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లు విజయనగరం, చీపురుపల్లి, ఎస్ కోటతో పాటు బొబ్బిలి పరిధిలోని గజపతినగరం నియోజకవర్గం స్థాయిలో పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్టు చెప్పారు. అదే క్రమంలో 20014 -19 వరకు వైఎస్సార్ సీపీ పాలనలో రైతులు సంక్షేమం కోసం పాటుపడిన విషయాన్ని రైతులు గుర్తు చేసుకోవాలన్నారు. తమ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ రైతు సంక్షేమానికి పెద్ద పీట వేశామని ఉద్ఘాటించారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ లో ప్రకటించిన అన్నదాత సుఖీ భవ కింద రూ.20 వేలు నిధులు ఏడాది పాటు ఎగ్గొట్టేయడమే కాకుండా ఈ ఏడాది కూడా వేల మంది రైతులకు ఈ నిధులను ఎగ్గొట్టేసిందని ఆరోపించారు. ఈ ఏడాది వ్యవసాయ పనులు మొదలయ్యే నాటికి కనీసంఎరువులు కూడా అందుబాటులో లేకుండా చేసిందని దుయ్యబట్టారు. మార్క్ ఫెడ్ ద్వారా వస్తున్న యూరియాను బ్లాక్ మార్కెట్ కు దారి మళ్లించి, తద్వారా రూ. 500లకు పైగా ఒక్క యూరియా బస్తాను బ్లాక్ లో కొనుక్కొనేలా రైతులను దోపిడీకి గురి చేస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో ఆరు వేల మెట్రిక్ టన్నుల యూరియా కొరతను పెట్టుకుని యూరియా అందుబాటులో ఉందని తప్పుడు ప్రకటనలతో ఈ ప్రభుత్వం , ఈ ప్రజాప్రతినిధులు రైతులను దగా చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని విమర్శించారు. వ్యవసాయ శాఖా మంత్రినుద్దేశించి మాట్లాడిన చిన్న శ్రీను..రైతు అంటే మీకు ఎందుకు అంత చులకన అంటూ మంత్రి అచ్చెన్నాయుడుని సూటిగా ప్రశ్నించారు. రైతులు ఎరువుల కోసం నానా అగచాట్లు పడుతుంటే, భోజనానికి నిలబడినట్లు యూరియా కోసం రైతులు క్యూ లైన్లో నిలబడితే తప్పేమిటంటూ రైతుల ఆత్మ గౌరవాన్ని కించపరిచేలా మంత్రి అచ్చెన్న చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం సక్రమంగా యూరియా అందిస్తే రైతులు ఎందుకు లైన్లలో నిలబడి పడిగాపులు కాయల్సి వస్తుందంటూ ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం రైతులను ఘోష పెట్టిస్తుందని దుయ్యబట్టారు. రైతు సేవలు కోసం తమ ప్రభుత్వం నిర్మించిన రైతు భరోసా కేంద్రాలను కొందరు కూటమి నాయకులు తమ నివాస భవనాలు గా వాడుకుంటున్నారని ఆరోపించారు. గత మా ఐదేళ్లలో ఏనాడైనా యూరియా, డీఎపీ కొరత ఉందేమో చూపించండంటూ సవాల్ విసిరారు. రైతుల పక్షాన నిలబడే ప్రజా ప్రతినిధులు ఈ జిల్లాలో ఎవరూ లేరని ఎద్దేవా చేశారు. వ్యవసాయ శాఖను నిర్వీర్యం చేసేసారని, యూరియా కోసం అధికారులను అడిగినా వారి దగ్గర సమాధానం లేదని పేర్కొన్నారు. ఈ పదహారు నెలలు కాలంలో ఈ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టు కోసం ఒక్క రూపాయి నిధులైనా విడుదల చేసారా అని ప్రశ్నించారు. యూరియా విషయంలో ప్రభుత్వం తప్పుడు ప్రకటనలు ఇచ్చి రైతులను దగా చేస్తోందని, ఇప్పటికైనా ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ రైతు సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళేందుకు రైతులతో, రైతు పోరాట సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమం చేపట్టనునట్టు తెలిపారు. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక మార్లు రైతుల పక్షాన నిలబడి పోరాటం చేశారని గుర్తు చేశారు. అలాగే ఈనెల 9 న జరిగే రైతు నిరసనలోనూ జగన్ మోహన్ రెడ్డి పాల్గొననున్నట్లు పేర్కొన్నారు.