మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్ప్రభావాలను యువతకు వివరించి, వారిని చైతన్యపర్చి, మాదక ద్రవ్యాలపై పోరాటం చేసేందుకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “సంకల్పం” కార్యక్రమాన్ని జూలై 18న బొబ్బిలి టిబీఆర్ ఫంక్షన్ హాలు నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశాఖ రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి, ఐసిఎస్ ముఖ్య అతిథిగా పాల్గొనగా, ప్రముఖ సినీ హీరో సుమన్ విశిష్ట అతిథిగా, స్థానిక ఎమ్మెల్యే ఆర్.వి.ఆర్.కె. కె.రంగారావు మరియు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనం చేసి, విఘ్నేశ్వరుని ప్రార్థనతో ప్రారంభించారు.
ఈ సందర్భంగా విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి, ఐపిఎస్ మాట్లాడుతూ – మాదక ద్రవ్యాలను నియంత్రించాలనే లక్ష్యంతో గంజాయి పంటను సాగు చేయకుండా చట్టపరమైన చర్యలు చేపడుతున్నామన్నారు. గిరి శిఖర ప్రాంతాల్లో 15,000 ఎకరాల్లో గంజాయి పంటను సాగు చేస్తున్నట్లుగా డ్రోన్స్ సహాయంతో గుర్తించి, పంటను ధ్వంసం చేసామన్నారు. పోలీసుశాఖ చేపడుతున్న నియంత్రణ చర్యలు ఫలితంగా నేడు 93 ఎకరాలకే గంజాయి సాగును పరిమితం చేయగలిగానున్నారు. గంజాయి వ్యాపారాలు సాగిస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు చేపడుతున్నామని, వారు సంపాదించిన అక్రమ ఆస్తులను కూడా సీజ్ చేసి, ప్రభుత్వ పరం చేస్తున్నామన్నారు. విశాఖ రేంజ్ పరిధిలో గంజాయి వ్యాపారాలతో అక్రమ ఆస్తులను కూడబెట్టిన 8మంది నిందితులకు చెందిన 9.20 కోట్ల ఆస్తులను ఇప్పటి వరకు సీజ్ చేసామన్నారు. మాదక ద్రవ్యాల అలవాటుకు యువత దూరంగా ఉండాలని, బంగారు జీవితాలను నాశనం చేసుకోవద్దని డిఐజి గోపీనాథ్ జట్టి యువతను కోరారు.
ఈ సందర్భంగా సినీ హీరో సుమన్ మాట్లాడుతూ – యువతను మాదక ద్రవ్యాలకు ఆకర్షితులు కాకుండాను, వాటికి అలవాటు పడిన వారిని మాదక ద్రవ్యాలకు దూరం చేసేందుకు, వారిలో చైతన్యం నింపేందుకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ‘సంకల్పం’ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. సినిమాల్లో మంచి స్థితిలో ఉన్నపుడు తన తలరాత కారణంగా జీవితంలో అగాధంలో కూరుకొనిపోయానన్నారు. ఈ సమయంలో తాను కూడా మద్యంకు అలవాటుపడి, ఆత్మహత్యకు ప్రేరేపితుడునయ్యానన్నారు. తన జీవితం ఎంతో ఉన్నతంగా ఉండాలని, తనకు మంచి విద్యను అందించి, కరాటే, భగవత్గీత వంటివి నేర్పించి, మంచి జీవితాన్నిచ్చిన తన తల్లిదండ్రులకున్న మంచి పేరును చెదగొట్టకూడదని, జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు పోరాటం చేయాలని నిర్ణయించుకొన్నానన్నారు. మెల్లగా చెడు అలవాట్లు నుండి బయటపడి, అభిమానుల ఆశీస్సులతో మంచి నటుడిగా నిలదొక్కుకోగలిగానన్నారు. వ్యసనాలకు బానిసలైతే కుటుంబ సభ్యులకు భారంగా మిగులుతామన్నారు. కావున, ప్రతీ ఒక్కరు మాదక ద్రవ్యాల నియంత్రణకు కృషి చెయ్యాలన్నారు. తోటి స్నేహితుల ఒత్తిడి, ప్రోత్సాహాలకు లొంగిపోకుండా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, జిల్లా పోలీసులు చేపడుతున్న ‘సంకల్పం’ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని సిని హీరో సుమన్ యువతకు పిలుపునిచ్చారు.
బొబ్బిలి ఎమ్మేల్యే ఆర్.వి.ఎస్.ఆర్.కె.కె. రంగారావు మాట్లాతూ – సమాజంలో పెరుగుతున్న మాదక ద్రవ్యాల వినియోగం వలన చాలా కుటుంబాలు, యువత నాశనమవుతున్నారన్నారు. సమాజానికి హాని కలిగించే మాదకద్రవ్యాల నియంత్రణ, నిర్మూలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పని చేస్తున్నాయన్నారు. జిల్లా పోలీసుశాఖ యువతలో చైతన్యం తీసుకొని వచ్చేందుకు ముంచి ఉద్దేశ్యంతో మన రాష్ట్రంలో మొట్ట మొదటి సారిగా జిల్లాలోనే ‘సంకల్పం’ కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగిందన్నారు. యువత చెడు వ్యసనాలకు బానిసలు కావద్దని, మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రతీ ఒక్కరూ ధృడ సంకల్పంతో పనిచేసి మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా, అమ్మకం, వినియోగం గురించి ఏదైనా సమాచారం తెలిస్తే సమాచారంను పోలీసువారికి అందించాలన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు తనవంతు సంపూర్ణ సహకారాన్ని అందిస్తానన్నారు.
జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – సమాజంలో యువత పాత్ర క్రియాశీలకమైనదన్నారు. కళాశాలల్లో చేరిన తరువాత యువతపై తల్లిదండ్రుల ప్రత్యక్ష పర్యవేక్షణ కొరవడుతుందని, కొత్తగా ఏర్పడిన స్నేహితులు, పరిచయాలతో యువతను ప్రక్క దారి పట్టించే అవకాశం ఉంటుందన్నారు. డ్రగ్స్ సరదాగా తీసుకున్నపుడు ప్రారంభంలో తాత్కాలికంగా ఆనందాన్ని ఇచ్చినప్పటికీ, తరువాత కాలంలో సరదా, అలవాటుగా, వ్యసనంగా మారుతుందన్నారు. స్నేహితుల ఒత్తిడితో డ్రగ్స్ తీసుకోవడం శృతిమించితే, ప్రాణాలు కోల్పోవలసి వస్తుందన్నారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వ్యక్తులు శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుందన్నారు. అంతేకాకుండా, మాదక ద్రవ్యాలకు అలవాటుపడిన వారు తమ ఆర్థిక అవసరాల కొరకు అప్పులు చేస్తూ, వాటిని తీర్చేందుకు చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడుతూ, పోలీసులకు చిక్కి, న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ, తమ జీవితాలను జైళ్ళలో గడుపుతున్నారన్నారు. నేరస్థులుగా మారిన వారిపై రౌడీ షీట్స్ తెరిచి పోలీసు నిఘా ఉంటుందని, వారు ఏ ఉద్యోగంలో చేరినా, విదేశాలకు వెళ్ళాలనుకున్నా పోలీసు వెరిఫికేషనులో వారి నేరచరిత బయటపడుతుందని, తద్వారా ఉపాధి, అవకాశాలు కోల్పోతారన్నారు. అంతేకాకుండా, గంజాయి కేసుల్లో నిందితులుగా పట్టుబడితే 20సం.లు వరకు జైలుశిక్ష పడే అవకాశం కూడా ఉందన్నారు. ఇది హత్య కేసుల్లో విధించే శిక్ష కంటే పెద్ద శిక్షని, జీవిత ఖైదు విధించిన వ్యక్తి 14సం.లు జైలుశిక్ష మాత్రమే అనుభవిస్తే, ఎన్.డి.పి.ఎస్. కేసుల్లో ఇరుకున్న వారికి గరిష్టంగా 20సం.లు వరకు శిక్ష విధించే అవకాశం ఉంటుందంటే, గంజాయి ఎంత తీవ్రమైన నేరమన్న విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తించాలన్నారు. ‘సంకల్పం’ కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా 800 స్కూల్స్ మరియు కాలేజీలలో ఉన్న 70 వేలమంది విద్యార్ధులకు, గ్రామాల్లో ఒక లక్ష 80 వేలు మంది ప్రజలకు యాంటి డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమాలను చేపట్టడం, మాదక ద్రవ్యాలు వినియోగం వలన కలిగే దుష్ప్రభావాలు గురించి తెలియజేసే కరపత్రాలను పంపిణీ చేసామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలియజేశారు.
సంకల్పం కార్యక్రమాన్ని ప్రారంభ సూచకంగా విశాఖరేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి, జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, సినీ హీరో సుమన్, బొబ్బిలి ఎమ్మేల్యే సంకల్పం బెలూన్ ఎగుర వేసారు. మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్ప్రభావాలను తెలియపరుస్తూ జిల్లా పోలీసుశాఖ రూపొందించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషను, ప్రదర్శించిన వీడియోలు విద్యార్ధులను ఎంతగానో ఆలోచింపజేసాయి. మాదక ద్రవ్యాలను నియంత్రించుటలో భాగంగా కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, యాజమాన్యం, స్థానిక ఇన్స్పెక్టరు వారితో యాంటీ డ్రగ్స్ కమిటీని ఏర్పాటు చేసారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని, తమ చుట్టూ ఉన్న వారిని కూడా మాదక ద్రవ్యాలకు దూరం చేసేందుకు తమవంతు కృషి చేస్తామని విద్యార్ధులతో బొబ్బిలి డిఎస్పీ భవ్యారెడ్డి ప్రతిజ్ఞ చేయించారు. కళాశాల విద్యార్థులను డ్రగ్స్ వినియోగం, కలిగివున్న వారి సమాచారంను అందించేందుకు కళాశాల్లో డ్రాప్ బాక్సు లను జిల్లా పోలీసులు ఏర్పాటు చేసారు. జిల్లా వ్యాప్తంగా అన్ని కళాశాలల్లోను, పబ్లిక్ ప్లేసెస్ లోను డ్రాప్ బాక్సులను ఏర్పాటు చేస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు.
అనంతరం, విశాఖ రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి, జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, సినీ హీరో సుమన్ కళాశాలకు డ్రగ్స్ పట్ల అవగాహన కలిగిన కళాశాలగా ధృవపరుస్తూ సర్టిఫికేటును కళాశాల యాజమాన్యంకు అందజేసారు. కాకర్ల గాంధీ మాస్టారు గంజాయికి దూరంగా ఉండాలని ఆలపించిన గీతం, మల్టీ టేలంట్ ఆధ్వర్యంలో విద్యార్ధులు ప్రదర్శించిన స్కిట్ విద్యార్ధులను, ఆహ్వానితులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈగల్ టోల్ ఫ్రీ నంబరు 1972 వాల్ పోస్టర్ను డీఐజీ గారు ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో బొబ్బిలి డిఎస్పీ భవ్యారెడ్డి, బొబ్బిలి సిఐ కే.సతీష్ కుమార్, బొబ్బిలి రూరల్ సిఐ కే.నారాయణరావు, భోగాపురం రూరల్ సిఐ జి. రామకృష్ణ, ఎస్బీ సిఐ ఎవి లీలారావు, ఇతర పోలీసు అధికారులు, బొబ్బిలి ప్రముఖులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.