రాష్ట్ర ప్రభుత్వం పారా క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలను కల్పిస్తుందని, పారా స్పోర్ట్స్ ద్వారా దివ్యాంగులకు బంగారు భవిష్యత్ ఉంటుందని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె. దయానంద్ తెలిపారు. బుధవారం నాడు అసోసియేషన్ సాయి కొరియన్ క్యాంపస్ ఛాలెంజ్ స్కూల్ లో నిర్వహించిన పారా స్పోర్ట్స్ అవగాహనా సదస్సుకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా పారా స్పోర్ట్స్ చైతన్య యాత్ర కరపత్రాలను విద్యార్థులు, సిబ్బంది తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడల ద్వారా మానసిక, శారీరక వికాసం కల్గుతుందని అన్నారు. చదువుతో బాటు క్రీడలు అవసరమని అన్నారు. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జి. ఒ. నంబర్ 4 ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో 3 శాతం ఉద్యోగాలను ఎటువంటి రాత పరీక్ష గాని, ఇంటర్వ్యూ గాని లేకుండానే విద్యార్హతను బట్టి నేరుగా కల్పిస్తుందని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించిన వారికీ ఇది అద్భుతమైన అవకాశమని అన్నారు. అలాగే పారా ఒలింపిక్స్ లోనూ, ఆసియన్ గేమ్స్ లోనూ మెడల్స్ సాధించిన విజేతలకు కోట్లాది రూపాయలు నగదు ప్రోత్సాహం అందజేస్తుందని వివరించారు. పారా క్రీడాకారుల కోసం విశాఖపట్నంలో 22 ఎకరాల్లో అత్యాధునిక స్టేడియం నిర్మిస్తుందని అన్నారు. ఈ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు దివ్యాంగులంతా పారా స్పోర్ట్స్ ఆడేందుకు ముందుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్యాంపస్ ఛాలెంజ్ డైరెక్టర్ లక్ష్మి నారాయణ శర్మ, అసోసియేషన్ సాయి కొరియన్ మెంబెర్ ఎం. ఎస్. నాయుడు, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఎస్. కోట ప్రతినిధి పూసపాటి ప్రతాప్ వర్మ, స్కూల్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.