నడయాడే గ్రంథాలయంగా పేరొందిన జిల్లాకు చెందిన గ్రంథాలయోధ్యమ నాయకులు జయంతి రామలక్ష్మణ మూర్తి వర్ధంతి సందర్బంగా జిల్లా గ్రంథాలయ సేవా సంఘం ఘనంగా నివాళులు అర్పించింది బుధవారం నాడు గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వున్న జయంతి రామలక్ష్మణ మూర్తి విగ్రహానికి సంఘం అధ్యక్షులు కె.ఎర్నాయుడు, వ్యవస్థాపకులు అబ్దుల్ రవూఫ్, గౌరవ అధ్యక్షులు నాలుగెస్సులరాజు, ఉపాధ్యక్షులు కె.దయానంద్ లు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రంథాలయాలపై అవగాహన కల్పించేందుకు, పుస్తకపఠనం పెంపొందించేందుకు జయంతి రామలక్ష్మణ మూర్తి విశేష కృషి చేసారని, వృత్తి రీత్యా ఉపాధ్యాయుడైనా ప్రవృత్తి గా గ్రంథాలయ ఉద్యమం చేపట్టారని అన్నారు. సైకిల్ పై ఊరూరా తిరుగుతూ గ్రంథాలయాల పట్ల యువతను చైతన్యం చేసారని వారి స్ఫూర్తి తో జిల్లా గ్రంథాలయ సేవా సంఘం స్వచ్ఛందంగా పని చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో గురజాడ గ్రంథాలయం సిబ్బంది శ్రీనివాస్, అప్పలనాయుడు, విద్యార్థులు పాల్గొన్నారు.