A2Z सभी खबर सभी जिले की

యూరియా పంపిణీపై మండల సర్వసభలో వాగ్వాదం

యూరియా పంపిణీ లో సరైన ప్రణాళిక లేదు అని విపక్షాల ఆరోపణ విపక్షాల ఆరోపణలు – అధికారులపై దూకుడు

 

మెంటాడ మండల ప్రజాపరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ రెడ్డి సన్యాసినాయుడు ఆధ్వర్యంలో మంగళవారం సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏఎంసీ చైర్మన్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఖరీఫ్ పంట సీజన్‌లో రైతులకు అవసరమైన యూరియా పంపిణీ విషయంలో సరైన ప్రణాళిక లేకపోవడంతో ఈ సమావేశం వాడివేడిగా సాగింది. ఎరువుల కొరత వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇది అధికారుల నిర్లక్ష్యమేనని విపక్ష ప్రజాప్రతినిధులు మండిపడ్డారు.

Related Articles

వైస్ ఎంపీపీ సారిక ఈశ్వరరావు, వైసీపీ మండల కన్వీనర్, ఇద్దనవలస సర్పంచ్ రాయి పిల్లి రామారావు తదితరులు వ్యవసాయ అధికారి గోకుల్ కృష్ణను ప్రశ్నిస్తూ రైతులకు సకాలంలో ఎరువులు అందకపోవడం వల్ల ఆందోళనలు చోటుచేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

దీనికి ప్రతిస్పందిస్తూ వ్యవసాయ అధికారి “ప్రతి రైతుకు వన్‌బీ ఆధారంగా ఒక బస్తా చొప్పున యూరియా అందుబాటులో ఉంచుతున్నాం, రైతులకు ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం” అని సమాధానం ఇచ్చారు.

ఏఎంసీ చైర్మన్ సూర్యనారాయణ మాట్లాడుతూ “వ్యవసాయ శాఖ చాలా కీలకమైనది, రైతు దేశానికి వెన్నెముక. అటువంటి రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడటం అధికారుల నిర్లక్ష్యమే. ఇలాంటివి పునరావృతం కాకుండా ముందస్తు ప్రణాళికతో పంపిణీ చేయాలి. అవసరమైతే ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలి” అని సూచించారు.

అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు ఒకేసారి వ్యవసాయ అధికారిపై దూకుడు ప్రదర్శించడంతో ఈ సమావేశం యూరియా మంటలు రేపింది. అనంతరం వివిధ శాఖల అభివృద్ధి పనులపై కూడా వాడివేడిగా చర్చలు జరిగాయి.

ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పి.దుర్గ, ఎంపీడీవో భానుమూర్తి, తహసీల్దార్ అరుణకుమారి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Show More
Back to top button
error: Content is protected !!