
భారత విద్యార్థి ఫెడరేషన్ SFI విజయనగరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25 న ఛలో కలెక్టరేట్ కార్యక్రమం చేయబోతున్నట్లు SFI జిల్లా అధ్యక్ష , కార్యదర్శులు డి రాము, సిహెచ్ వెంకటేష్ లు తెలిపారు. స్థానిక LBG భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టరేట్ ప్రచార పోస్టర్ లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచింది అని కానీ విద్యా రంగ సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్న చందంగా తయారయింది అని విమర్శించారు. ప్రధానంగా జిల్లాలో 5 ఏళ్ల క్రితం ఏర్పడిన విజయనగరం, రాజాం , గజపతినగరం డిగ్రీ కళాశాలలు దిక్కు మొక్కు లేకుండా పోయాయని విమర్శించారు. తక్షణమే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు సొంత భవనాలు నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ హాస్టల్స్ కు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. పెండింగ్ లో ఉన్న 6500 కోట్ల ఫీజ్ రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేసి డిగ్రీ విద్యార్ధులకు న్యాయం చేయాలని కోరారు. 2 ఏళ్లుగా స్కాలర్షిప్ విడుదల కాకపోవడంతో అనేక మంది తమ తమ చదువులను అర్థంతరంగా ఆపేశారని తెలిపారు. సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారే తల్లికి వందనం నిధులు 523 కోట్లు ప్రభుత్వం పెండింగ్ పెట్టిందని తెలిపారంటే విద్యా శాఖ పరిస్తితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవాలి అని దుయ్యబట్టారు. తక్షణమే పెండింగ్ లో ఉన్న తల్లికి వందనం నిధులు విడుదల చేయాలని కోరారు. నారా లోకేష్ గారు పాదయాత్ర లో GO 77 రద్దు చేస్తామనే ఒక హామీ ఇచ్చారని ,కనీసం ఆ హామీ అయిన గుర్తుందా అని దుయ్యబట్టారు. GO 77 రద్దు చేసి PG విద్యార్ధులకు స్కాలర్షిప్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అందించారని , ఇదే సందర్భంలో విద్యార్ధులకు కూడా ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించాలని కోరారు. JNTUGV కి నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని , కాళిగా ఉన్న అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని కోరారు. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ కి సొంతభవనం లేక గత 7 ఏళ్లుగా అద్దె భవనాల్లో నడుస్తుంది అని విద్యార్థుల సంఖ్య కూడా తగ్గిపోతుందని విమర్శించారు. తక్షణమే నిర్మాణాలను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్స్ సాధన కొరకు జరుగుతున్న చలో కలెక్టరేట్ ఈ నెల 25 న జరుగుతుందని , దీన్ని విద్యార్థులంతా వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారానికి విద్యా శాఖ కృషి చేయాలని , లేని పక్షంలో రాష్ట్ర అసెంబ్లీ నీ ముట్టడిస్తామని దీనికి విద్యా శాఖ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో SFI జిల్లా ఉపాధ్యక్షులు జ్.రవికుమార్, శిరీష, జిల్లా సహాయ కార్యదర్శులు పీ. రమేష్, క్. రాజు , వంశీ మరియు జిల్లా కమిటీ సభ్యులు రమణ , జయ తదితరులు పాల్గొన్నారు.